పోర్న్ వెబ్‌సైట్ లో ప్రధాని ఫోటోలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటలీలో ఒక పోర్న్ వెబ్‌సైట్ సృష్టించిన దుమారం ఆ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని సహా పలువురు ప్రముఖ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఆ సైట్‌లో ప్రచారం చేయడమే ఇందుకు కారణమైంది. ఈ వికృత చర్యపై ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో 7 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న ‘ఫికా’ అనే ఈ వెబ్‌సైట్‌ను మూసివేస్తున్నట్లు ఆ వెబ్ సైట్ నిర్వాహకులు ప్రకటించారు.
తన గురించి దారుణంగా ప్రచురించిన వెబ్ సైట్ ఘటనపై ప్రధాని మెలోని తీవ్రంగా స్పందించారు. “జరిగిన ఘటన పట్ల నాకు తీవ్ర అసహ్యం వేస్తోంది. ఈ చర్య ద్వారా అవమానానికి, వేధింపులకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటాయి” అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
“సాధారణంగా కనిపించే కంటెంట్ కూడా తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే భయంకరమైన ఆయుధంగా మారగలదు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడమే ఉత్తమమైన రక్షణ” అని ఆమె సూచించారు.ఈ వెబ్‌సైట్‌లో ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. ఆమె ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇది సమాజంలో వేళ్లూనుకుపోయిన ‘రేప్ కల్చర్’కు నిదర్శనమని ఆరోపించారు. “ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను సాధారణ విషయంగా చూపిస్తూ దాన్ని సమర్థిస్తున్నారు. వికృత మనస్తత్వాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి సైట్లు వేదికలుగా మారుతున్నాయి” అని ఆమె విమర్శించారు.