రైల్వే శాఖ కు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లేఖ
పల్లవి, వెబ్ డెస్క్ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో గోదావరిఖని నుంచి కన్నాల గ్రామం మరియు చుట్టుపక్కల 100 కంటే ఎక్కువ గ్రామాలకు కలపే రైల్వే గేట్ నంబర్ 46-E/A వద్ద ప్రజలు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను రవాణా అంతరాయాలు, అత్యవసర సేవలకు ఆటంకాలు తలెత్తుతున్నందున వాటిని నివారించేందుకు అండర్‌పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే శాఖకు లేఖ రాశారు.ఈ లేఖ పై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఆర్.ఒ.బీ. (రోడ్ ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణానికి ఇప్పటికే 2020-21 సంవత్సరంలోనే రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు.
మొదటగా ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో వ్యయం పంచుకునే ప్రాతిపదికన ఆమోదించారు. అయితే 25.03.2023 నాటి ఉత్తరం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాలేమని తెలపడంతో, ఈ ప్రాజెక్ట్‌ను రైల్వే శాఖ పూర్తిగా 100% నిధులతో చేపట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 86.12 కోట్ల ఖర్చు అంచనా వేసి, 06.05.2025 న ‘Special Railway Project’ గా ప్రకటించబడింది.
ప్రస్తుతం టెండరింగ్ ప్రక్రియలో ఉంది, మరియు 2028-29 నాటికి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణ గడ్డం గారు స్పందిస్తూ, ఈ ROB పట్ల రైల్వే శాఖ చూపిన సానుకూల స్పందన, స్థానిక ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, అత్యవసర సేవలకు ఎంతో మేలు కలిగిస్తుందని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.



