అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: వద్దిరాజు

పల్లవి, వెబ్ డెస్క్ : దుర్గామాత ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. అమ్మవారి చల్లని చూపుతో జిల్లాలో కరువు కాటకాలు లేకుండా, పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని వేడుకున్నారు. గురువారం రాత్రి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు తోట రామారావు, తోట గోవిందమ్మల ఆధ్వర్యంలో నెలకొల్పిన దసరా అమ్మవారి విగ్రహం వద్ద ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్రను ఆయన అభిమానులు భారీ బాణాసంచా, డప్పుల మోత మధ్య స్వాగతించారు. ఈ సందర్భంగా తోట రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడారు. హైదరాబాద్ నగరానికే పరిమితం అయ్యే ఆగమన వేడుకలు ఖమ్మం లో కూడా నిర్వహించడం అభినందనీయం అన్నారు. తొమ్మిది రోజులపాటు ఇక్కడ జరిగే పూజా వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం తోట బ్రదర్స్ పుట్టినరోజు వేడుకలను సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించారు.
పొంగులేటి వ్యాఖ్యలను ఖండించిన వద్దిరాజు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి బచ్చాగాడు అని చేసిన వ్యాఖ్యలను ఎంపీ రవిచంద్ర ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి అదే బచ్చగాడితో స్నేహం చేసిన విషయం మరిచారా..? అని ప్రశ్నించారు. ఆ బచ్చా గాడే 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడనే విషయం గుర్తెరగాలని అని అన్నారు. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్లో ప్రజలే సమాధానం చెప్తారని ఎంపీ రవిచంద్ర అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, తోట రమేష్, తోట లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.