సీఎం కప్ చాంపియన్ షిప్లో సత్తా చాటిన డీపీఎస్ స్టూడెంట్స్

పల్లవి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ షూటింగ్ చాంపియన్షిప్ 2024–25 పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ చాటారు. 2024 డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి కప్ షూటింగ్ చాంపియన్షిప్ 2024–25లో డీపీఎస్ నాచారం విద్యార్థులు అద్భుత ప్రతిభతో మెరిశారు. ఆదివారం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు అవార్డులు అందుకున్నారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్ సూర్య కృష్ణ స్వర్ణ పతకం సాధించారు. అనన్య జవ్వాజీ అనే టెన్త్ స్టూడెంట్10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో రజత పతకం సాధించారు. భూక్య కిరణ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో రజత పతకం పొందారు. రాష్ట్ర స్థాయిలో డీపీఎస్ నాచారం విద్యార్థులు చూపిన ప్రతిభపై స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య, ప్రిన్సిపల్, టీచర్లు ప్రశంసించారు.