ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి – హీరో సాయి దుర్గ తేజ్

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రజల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా…హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ ట్రాఫిక్ మీట్‌కు రావటం వెనుక నా వ్యక్తిగత కారణం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 10, 2021లో నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను రెండు వారాల పాటు కోమాలో ఉన్నాను. ఇది అందరికీ సానుభూతి కోసం చెప్పటం లేదు. అందరికీ తెలియాలని చెబుతున్నాను. ఆ రోజు నేను ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలతో బయటపడటానికి ప్రధాన కారణం..తలకు హెల్మెట్‌ను ధరించటమే. అందువల్లనే నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి బైక్ తోలే ప్రతీ ఒక్కరికీ హెల్మెట్ తప్పకుండా ధరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను.బండి నడిపే ప్రతీ ఒక్కరి కుటుంబ సభ్యుడు, భాగస్వామి తప్పకుండా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలి. యాక్సిడెంట్ తర్వాత నా వాయిస్ పోయింది.. చాలా విషయాలు మరచిపోయాను. జీవితంపై ఆశను వదులుకున్నాను. బైక్స్‌ను వేగంగా నడపకండి. అందరికీ అద్భుతమైన జీవితం ఉంది. అందరూ నవ్వుతూ జీవించాలి. మీరు ప్రేమించేవాళ్లు నవ్వుతూ ఉండాలంటే మీరు బైక్ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కారు నడిపేవాళ్లు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సీట్ బెల్ట్స్ ధరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. రూల్స్ పాటించటం వల్ల మీకే కాదు.. మీతో, ఎదురుగా ఉండే తోటి ప్రయాణీకులకు కూడా మంచిది.