ఇక బయట తిరగలేరు.. భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష : సీఎం చంద్రబాబు
రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు
రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేశారు.
తల్లి, చెల్లిని సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానివెనుక గంజాయి బ్యాచ్ ఉందన్నారు. నాసిరకం మద్యం విక్రయించడం వల్లే ప్రజలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పారు. విద్యాసంస్థల ప్రాంగణాలకు కూడా గంజాయి, డ్రగ్స్ చేరాయని ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూఆక్రమణలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. వాళ్లు ఇక బయట తిరగలేరు’ అని హెచ్చరించారు.



