సీఎం కన్ను పడొద్దమ్మా..ఇళ్లకు దిష్టి తీస్తున్న మహిళలు!
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ హైడ్రా అనే పదం వింటేనే జనం భయపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ హైడ్రా అనే పదం వింటేనే జనం భయపడుతున్నారు. ముఖ్యంగా చెరువుల సమీపంలో ఇళ్లు ఉన్నవాళ్లు అయితే గుండెలను చేతుల్లో పట్టుకొని తిరుగుతున్నారు. మరోవైపు,మూసీ నది సమీపంలో ఇళ్లు ఉన్నవాళ్లు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ తమ ఇంటివైపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో కొత్త ఇళ్లు కట్టాలంటేనే ప్రస్తుతం కొంతమంది వణికిపోతున్నారు. అయితే తాము పేదల జోలికి వెళ్లం అంటూ హైడ్రా కమిషనర్ చెప్తున్నప్పటికీ వాస్తవరూపంలో మాత్రం హైడ్రా కారణంగానే పేదలే నష్టపోతున్నారు.
ఆఖరికి అధికార పార్టీ నాయకులు కూడా హైడ్రా తీరుని తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి తమ ఇళ్లపై పడొద్దంటూ మ ఇళ్లకు దిష్టి తీసి హైదరాబాద్ మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. బుధవారం పితృ అమావాస్య కావడంతో తమ ఇళ్లకు రివర్ బెడ్ పేరిట పట్టిన పీడ వదిలిపోవాలంటూ కుంకుమ నీటితో దిష్టి తీసి ఇళ్ల ముందు ఆరబోశారు చైతన్యపురి డివిజన్ వినాయకనగర్ కాలనీలో మహిళలు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇళ్ల జోలికిరావద్దని కోరారు. ఇక,హైడ్రా నుంచి కాపాడు బతుకమ్మ.. మా ఇళ్లు కూల్చొద్దు బతుకమ్మ అంటూ ఫిల్మ్‌నగర్ చెరువు వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. హైడ్రాను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.



