TQ HYDRA: ఉదయం కూల్చివేత.. సాయంత్రానికి సీసీ రోడ్డు
TQ HYDRA: ఉదయం కూల్చివేత.. సాయంత్రానికి సీసీ రోడ్డు

పల్లవి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)పై ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ క్రమంగా పాజిటివ్ గా మారుతున్నది. బండ్లగూడ జార్ మున్సిపాలిటీ లోని కిస్మత్ పురాలో రోడ్డు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిన హైడ్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో కిస్మత్‌పురాలో రెండు కాలనీలను కలిపే రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా సోమవారం తొలగించింది. అదే రోజు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీతో రోడ్డు వేయించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని హైడ్రా చూపింది.
వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, బండ్లగూడ జాగీర్‌లోని ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హర్షిత్ లే ఔట్ల మధ్య ఉన్న ఈ రహదారి కూల్చివేతతో పరిసర కాలనీలకు దారి దొరికింది. కిస్మత్‌పురా గ్రామంలో 18.65 ఎకరాల్లో 173 ప్లాట్లతో ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ పేరిట కాలనీ ఏర్పడింది. ఈ కాలనీకి ఆనుకుని దాదాపు 12 ఎకరాలలో 160 ప్లాట్లతో శ్రీ హర్షిత్ లే ఔట్ వచ్చింది. ఈ రెండు లే ఔట్లను కలుపుతూ 30 అడుగుల వెడల్పుతో రహదారి ఉంది. గతంలో ఇళ్ల నిర్మాణాలు జరగనప్పుడు లే ఔట్లను కాపాడుకోవాలనే నెపంతో రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించారు. 6 నెలల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చేయడంతో రహదారికి ఆటంకాలు తొలగాయి. కానీ మళ్లీ శ్రీ హర్షిత్ లేఔట్ వాళ్లు రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించడంతో వివాదం తలెత్తింది. మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టినా తిరిగి నిర్మించడంతో 3 ఏళ్లుగా అవస్థలు పడుతున్నామని.. ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ కాలనీవాళ్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారించి సోమవారం ఉదయం మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా ఆ అడ్డుగోడను తొలగించింది. రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని తొలగించడమే కాకుండా.. ఆ వెంటనే బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి సాయంత్రానికల్లా సిమ్మెంట్ రోడ్డు వేయించడంతో రెండు కాలనీల మధ్య అడ్డుగోడను శాశ్వతంగా తొలగించినట్లయ్యింది. అడ్డుగోడ ఉండడంతో 3 ఏళ్లుగా నరకం చూశామని, 2 కిలోమీటర్లకు పైగా అదనంగా ప్రతి రోజు ప్రయాణించాల్సి వచ్చిందని.. ఇప్పుడు మా కష్టాలకు తెర పడిందని స్థానిక కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రహదారికి అడ్డంగా ఉన్న ప్రహరీని కూల్చి సమస్యను పరిష్కరించిన హైడ్రాతో పాటు.. సాయంత్రానికి సిమ్మెంట్ రోడ్డు వేసిన బండ్లగూడ జాగిర్ మున్సిపాలిటీకి స్థానికులు అభినందనలు తెలిపారు.