వరద బాధితులకు అండగా ఉంటాం – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాలల్లో ముఖ్యమంత్రిఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, జిల్లా కలెక్టర్ అభిషేక్ సంఘ్వీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు గత వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద నేడు వచ్చింది. వరదల వల్ల , భారీ వర్షాల వల్ల నష్టపోయిన మిమ్మల్ని ప్రజాప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుంది.మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు.కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు.మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ “కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నాను.వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి.పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది.తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం.ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం.శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించానని” తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం.పంట నష్టపరిహారం అందిస్తాం.రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి.అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి” అని అన్నారు.