ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాసిన లేఖకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం 107 రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం గురించి ఎంపీ రవిచంద్ర ఈనెల 7వతేదీన సంబంధిత శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు.
ఈ క్రాసింగ్ కారణంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రామకృష్ణాపురంకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ఎంపీ రవిచంద్రను కలిసి వినతిపత్రం ఇవ్వగా,ఈ విషయమై ఆయన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాయడం జరిగింది.దీనికి మంత్రి వెంటనే స్పందించి రవిచంద్రకు లేఖ ద్వారా బదులిచ్చారు.
రామకృష్ణాపురం గ్రామ సమీపంలోని 107 లెవల్ క్రాసింగ్ వద్ద అండర్ బ్రిడ్జి (ఆర్వోబీ)నిర్మించాలనే అంశం తన శాఖ పరిశీలనలో ఉందని,అధికారులకు తగు ఆదేశాలివ్వడం జరిగిందని ఎంపీ రవిచంద్రకు రాసిన లేఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.దీంతో, రామకృష్ణాపురం,దాని పరిసర గ్రామాల ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.