ఇంట్లో చికెన్ వండుతున్నారా.. ఫారం కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా
చికెన్ అంటే పిల్లలు సహా పెద్దవాళ్లు కూడా చాలా ఇష్టపడతారు. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఉండాల్సిందే.

చికెన్ అంటే పిల్లలు సహా పెద్దవాళ్లు కూడా చాలా ఇష్టపడతారు. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. ఇక చికెన్ తో చేసే వెరైటీలు కూడా ఎక్కువే. చికెన్ 65 దగ్గర్నుంచి బిర్యానీ వరకు అనేక రకాలుగా కోడిని ఇష్టంగా ఆరగిస్తుంటారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో హోటల్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అందులో ఎక్కువగా కనిపించేది చికెన్ వంటకాలే. పోషకాహార నిపుణులు కూడా కోడి మాంసంలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. నిర్ణీత పరిణామంలో తీసుకుంటే హెల్త్ కి మంచిదని అంటుంటారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం చికెన్ తినేముందు కొంచెం జాగ్రత్తగా వండుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే డెంజర్ బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదేదో నార్మల్ స్టడీ చెబుతున్నది కూడా కాదు. ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడైన భయంకరమైన నిజం.. కోళ్లకు యాంటీ బయాటిక్స్ అతి వినియోగంతో…. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ NIN సైంటిస్టులు స్టడీ చేశారు. ఈ కోళ్లలో యాంటీ బయాటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్స్ లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయాటిక్స్ విచక్షణరహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ AMR వృద్ధి చెందుతోందని నిర్ధారించారు. ఇలాంటి చికెన్‌ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఆ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి అధ్యయనం చేపట్టారు. రెండు రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీఫామ్స్ లో 131 కోడి రెట్టలను శాంపిల్ గా సేకరించారు. వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయని తెలిపారు.
కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను సైంటిస్టులు గుర్తించారు. ఇవన్నీ మన మనదేశంలో యాంటీ బయాటిక్ ట్రీట్ మెంట్‌కు ఆటంకంగా మారే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు వెల్లడించారు. అయితే ఇలాంటి చికెన్‌ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికిస్తే 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందంటున్నారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్-..ఏఎంఆర్ జన్యువు తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. కోడి మాంసంలో ప్రాణాంతక బ్యాక్టిరీయా జన్యువులు… యాంటీ బయాటిక్స్ ను తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండడం గమనించామని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, కలరా, ఫుడ్ పాయిజన్ వంటి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందని… ట్రీట్ మెంట్ కు సవాల్ గా మారనుందని వెల్లడిస్తున్నారు. AMR బ్యాక్టీరియా పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే దృష్టిపెట్టాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
మరి చికెన్ తో బ్యాక్టీరియా ఒక్కటే ప్రమాదకరంగా మారిందా అంటే… ఇంకా రీజన్స్ చాలానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కోడి వేగంగా బరువు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల బాలికలకు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. బాయిలర్ చికెన్ తిన్న చిన్నారులు ముందస్తు యుక్తవయసుకు వస్తున్నారు. హార్మోనల్ మార్పులు చోటుచేసుకుటుండగా త్వరగా పీరియడ్స్ వస్తున్నాయని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చికెన్ తో పాటు ఎక్కువ పాల ఉత్పత్తి కోసం పశువులకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్లు కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. బర్డ్ ఫ్లూ వంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు చికెన్ అంటే జనం కొంత భయపడుతున్నారు. ఆ తర్వాత మామూలుగానే తినేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికే అవగాహనతో ఉంటున్నారు. కోళ్లకు ఎక్కువగా కాళ్లు, మెడ భాగంలో ఇంజెక్షన్స్ ఇస్తుండటం వల్ల ఆ పార్ట్స్ వద్దని చికెన్ సెంటర్లలో దూరం పెడుతున్నారు. అయితే ఈ డేంజర్ నుంచి గట్టెక్కాలంటే కోళ్ల పెంపకంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సన అవసరం ఉంది.