మండలిలో గొంతెత్తిన మల్లన్న.. తొలి ప్రసంగంలోనే కీలక అంశాలు ప్రస్తావన
పల్లవి, హైదరాబాద్ : శాసన మండలిలో తీన్మార్ మల్లన్న అదరగొట్టారు. తొలి స్పీచ్ లోనే కీలక అంశాలను ప్రస్తావించి ప్రజలను ఆకట్టుకున్నారు. గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. అయితే దాన్ని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. టాప్ ర్యాంకర్లను జనరల్ కేటగిరీలోకే తీసుకోవాలని మల్లన్న సూచించారు. యూపీఎస్సీ తరహాలో ఉండేలా ఎంపిక చేస్తే ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
అదేవిధంగా రైతు భరోసా విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. గతంలో పెట్రోల్ బంకులు, వెంచర్లు, ఇళ్లు నిర్మించుకున్న స్థలాలతో పాటు అనర్హులకు రైతు బంధు ఇచ్చారని.. కానీ అర్హులకే రైతు భరోసా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
గందమళ్ల రిజర్వాయర్‌ను పూర్తి చేయండి..
సుదీర్ఘంగా గందమళ్ల రిజర్వాయర్ పెండింగ్‌లోనే ఉందని మల్లన్న అన్నారు. ఈ రిజర్వాయర్ తన సొంత మండలంలో ఉందని.. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్ధుతూ.. ప్రభుత్వం రిజర్వాయర్ ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ బడ్జెట్లోనే రిజర్వాయర్‌కు కావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు.



