నో క్లారిటీ.. రుణమాఫీ కాని రైతులు ఎటుపోవాలె?
పల్లవి, హైదరాబాద్: రుణమాఫీ కాని రైతులు గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ రాకపోవడం, అధికారులు సరిగా స్పందించకపోవడంతో అన్నదాతలు రుణమాఫీ కోసం అటు బ్యాంకులు, ఇటు మండల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణమాఫీ కాని రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రభుత్వం చెప్తున్నా.. రైతుల సమస్యలను అడ్రస్ చేయడంలో ముందడుగు పడటం లేదు. క్లస్టర్ల వారీగా గత సర్కారు హయాంలో నిర్మించిన రైతు వేదికలు ఉన్నా.. వాటి వద్ద సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం నడవడం లేదు. అధికారులు మండల కేంద్రాలకే పరిమితం అవుతుండగా.. రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.
నోడల్ అధికారి..
రూ.రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూలును ప్రభుత్వం ప్రకటిస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇటీవల తెలిపారు. అర్హత ఉండి, ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని, రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం, బ్యాంకు వద్ద నమోదైన డేటాలో చిన్నచిన్న తప్పులు, పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం తదితర ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్ అధికారికి సమర్పించాలని ఆయన సూచించారు. ఈ నెల 20 నుంచే మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదుల స్వీకరణ మొదలైందని అధికారులు చెబుతున్నా.. మెజార్టీ జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.
వ్యవసాయ అధికారులు..
ఆయా మండలాల ఏవోలు వారి వారి కార్యాలయాల్లో అన్నదాతలకు అందుబాటులో ఉండాలని, మండలంలో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, పీఏసీఎస్‌లకు మండల వ్యవసాయ అధికారే బాధ్యత వహించాలని సర్కారు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రాల్లో చేపట్టే ప్రజావాణి తరహాలో కార్యక్రమం నిర్వహించాలని, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు ఇటీవల నిర్ణయించారు. రుణమాఫీ వర్తించని రైతులంతా మండల కేంద్రంలోని రైతు వేదికలు లేదా ఏఓలకు అర్జీలు సమర్పించవచ్చు. కానీ ఈ వివరాలేవీ రైతులకు తెలియడం లేదు. పది రోజుల పాటు కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి రుణమాఫీ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.



