ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ – మళ్లీ తెరపైకి లిక్కర్ స్కామ్..!!

పల్లవి, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధినాయకత్వం నుంచి ప్రకటన వెలువడటంతోనే ఇటు కవిత అభిమానులు, అటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పెద్ద సోషల్ వార్ మొదలైంది. నిన్నా మొన్నటి వరకు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏవైపో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు సస్పెన్షన్ ఆర్డర్ రాగానే కేసీఆర్ వైపు మళ్లారు. గల్లీలోని కార్యకర్త నుంచి మాజీ మంత్రి వరకు , తాజా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత ఒకరూ మీడియా సమావేశం పెట్టి మరి బీఆర్ఎస్ కు మద్ధతుగా, కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ఒకటే ప్రకటనలు మీడియాకు ఇచ్చారు.
ఒక సోషల్ మీడియా వేదికగా అయితే గతంలోని వీడియోలు, ఫోటోలతో కవిత వర్సెస్ కేటీఆర్, హారీశ్ రావు వర్గాలు అయితే ఒక రేంజ్ లో యుద్ధం చేస్కుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత బీఆర్ఎస్ నేతల పట్ల వ్యవహరించిన తీరు, చేసిన మాటలు పార్టీకి నష్టం చేశాయని ఒక వర్గం ఆరోపిస్తే , కాదు పార్టీకి నష్టం చేస్తున్న వారిని గురించి చెబితే జాగ్రత్త పడాల్సింది పోయి సస్పెండ్ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు మండిపడుతున్నారు. ఈ ఆరోపణల్లో భాగంగా తెలంగాణలో జరిగిన రెండో సార్వత్రిక( 2018) ఎన్నికల సమయంలో గజ్వేల్ లో అప్పటీ సీఎం కేసీఆర్ పై పోటీ చేసిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి హారీశ్ రావు గురించి మాట్లాడిన వీడియోను కవిత వర్గం వైరల్ చేస్తుంది.
ఆ వీడియోలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ” గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న కేసీఆర్ ను ఓడించాలని తనకు హారీశ్ రావు ఫోన్ చేశారని, మొత్తం తాను చూస్కుంటానని చెప్పారని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా కేటీఆర్, హారీశ్ వర్గాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయిన వీడియోను వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు హారీశ్ రావుతో ఎలాంటి నష్టం లేదని , లిక్కర్ స్కామ్ తో తీరని నష్టం జరిగింది. అందుకే ఓడిపోయామని హారీశ్ , కేటీఆర్ వర్గం ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తో ఈ విధంగా మరోకసారి లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నమాట.