రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం తప్పా రెండు రాష్ట్రాల్లో నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి సుధీర్ఘ భేటీ జరిగింది.
ఈ భేటీ గురించి మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో మాజీ మంత్రి కేటీఆర్ వీరిద్దరి భేటీ గురించి ప్రస్తావిస్తూ ‘ కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కోట్లాడినవారు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో తేలిపోయిందని’ విమర్శించారు.
బుధవారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని బుకాయించి, గురుదక్షిణగా గోదావరి జలాలు అప్పచెప్పడానికి గద్దెనెక్కావా రేవంత్ అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చుక్క నీరు అక్రమంగా అప్పజెప్పినా మరో పోరాటం చూస్తావని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమికొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతిపెడతామని ఆయన రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.