దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?
తెలంగాణలో అతిపెద్ద పండుగల్లో దసరా మెయిన్. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ వాసులందరూ దసరా రోజున తప్పకుండా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు.
తెలంగాణలో అతిపెద్ద పండుగల్లో దసరా మెయిన్. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. గ్రామాల్లో అయితే పొలాల్లో.. చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటుంటారు. పట్టణాల్లో అయితే డబ్బులిచ్చి మరీ దర్శనం చేసుకుంటుంటారు. ఈ పాలపిట్టను దుర్గామాత స్వరూపంగా చెబుతారు.
నీలం, పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపిట్టచూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్టను దసరా నాడు దర్శించుకుంటే అంతా శుభ సూచికంగా భావిస్తుంటారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పత్రాలు ఇచ్చిపుచ్చుకోవడం తర్వాత పాలపిట్టను చూడడం ఒక ఆనవాయితీగా కంటిన్యూ అవుతుంది. అయితే దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి వెళ్తున్న క్రమంలో శ్రీరాముడికి పాలపిట్ట ఎదురైంది.
ఆ తర్వాత రాముడు.. రావణుడిని సంహరించి విజయం సాధించారు. దీంతో పాలపిట్ట దర్శనం శుభంగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టారు. వాటికి పాలపిట్ట రూపంలో ఇంద్రుడు కాపలా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి రాజ్యానికి వెళ్తున్న క్రమంలో మొదట పాలపిట్ట దర్శనం కావడంతో వారికి అన్ని శుభ ఫలితాలే కలిగాయని పూండితులు చెబుతుంటారు. అందుకే దసరా రోజున పాలపిట్టను దర్శిస్తే శుభం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తుంటారు.



