రేవంత్ రెడ్డిని జైపాల్ రెడ్డి దగ్గరికి రానియ్యలే : హరీశ్ రావు
పల్లవి, హైదరాబద్: సీఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వం డిఫెన్స్ లో పడినప్పుడు సీఎం రేవంత్ ఏదో ఒక పేపర్ పట్టుకొని వచ్చి సభను డైవర్ట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘మోటార్లకు మీటర్ల అంశానికి ముఖ్యమంత్రి సభలో మాట్లాడినప్పుడు మెటీరియల్లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలనే చదవలేదు.
అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. అప్పులపై సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించేలోగా.. బీఆర్ఎస్ హయాంలో మోటార్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారంటూ ముఖ్యమంత్రి సభను మిస్ లీడ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగాలేకపోవడంతోనే మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు.
రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. అసలు కాంగ్రెస్లో వీహెచ్ లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు. 2018లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.



