బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును వెంటనే కూల్చేయండి: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి పార్టీ ఆఫీస్ నిర్మించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం నల్గొండలో మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాలని సూచించారు. తాను అమెరికా వెళ్లి వచ్చే లోగా అంటే పార్టీ ఆఫీసును కూల్చేయాలని సూచించారు.
కూల్చకపోతే జైలుకే
‘నేను అమెరికాకు వెళ్తున్నా.అగస్టు 11న తిరిగి వస్తాను. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలి. కమిషనర్ కూల్చకపోతే ఎందుకు కూల్చడం లేదో అడీషనల్ కలెక్టర్ విచారించి జైలుకు పంపాలి. మున్సిపల్ చైర్మన్ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఆ స్థలంలో 20 లక్షల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. స్త్రీ నిధి భవనం సైతం అక్కడ నిర్మించి పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని కోమటిరెడ్డి అధికారులకు సూచించారు.