మాజీ మంత్రి హరీశ్ కు మంత్రి దామోదర కౌంటర్
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా కౌంటరిచ్చారు. మంత్రి దామోదర మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం అంటే జీవోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు కట్టి, కాగితాలపై కాలేజీలను చూపించి , వైద్య విద్యను నాసిరకంగా చేసింది మీరు కాదా అంటూ ఆయన నిలదీశారు. సౌకర్యాలు లేవంటూ ఇప్పుడు నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ , పిల్లలను తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసేలా ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
హారీశ్ రావు హయాంలో సరైన ప్రణాళిక లేకుండా కాలేజీలు ప్రారంభించడం వలనే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని మంత్రి దామోదర ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రజాప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీకి మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంతో పాటు ఒక్క మెడికల్ సీటు కూడా నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.



