బీసీ రిజర్వేషన్లపై చేతులెత్తేసిన కాంగ్రెస్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఉన్న బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఇక మరిచిపోవాల్సిందేనా..?. ఇక ఇప్పట్లో ఆ హమీ అమలు కావడం సాధ్యం కాదా..?. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమేనా..?. అంటే అవుననే స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది నిజమేనని అన్పిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన బీసీ రిజర్వేషన్లకై మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులగణన చేశాం. దేశానికి ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలోని బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకున్నాం. కేంద్రం అనుమతికోసం ఢిల్లీకి పంపాం. నిమ్మకు నీరు ఎత్తనట్లు మోదీ సర్కారు ఆ బిల్లును ఆమోదించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించకపోకపోతే ఆయన గద్దె దించుతాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. తెలంగాణ నుంచే మోదీ పతనాన్ని ప్రారంభిస్తాం అని అన్నారు.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టీ మాట్లాడుతూ ‘ తెలంగాణలోని బీసీలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే కులగణనను చేపట్టాము. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే బిల్లును అసెంబ్లీలో పెట్టీ ఆమోదించుకున్నాం. ఆ బిల్లును కేంద్రానికి పంపాం. ఇప్పుడు బంతి కేంద్ర చేతుల్లో ఉంది. కేంద్రం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా సహకరించాలని ఆయన కోరారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన వ్యాఖ్యలతో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.



