విద్యా భరోసా ఊసే లేదు .. విద్యాశాఖ మంత్రి ఎక్కడ?
– గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ కేసులు
– సంబంధిత మంత్రి లేక కనీస సమీక్షలు కరవు
– స్కావెంజర్లు లేక బడి ఊడ్చే దిక్కులేని పరిస్థితి
– కంపు కొడుతున్న మరుగుదొడ్లు.. విద్యార్థుల అవస్థలు
– రూ.5,900 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు
– ఆరు గ్యారంటీల్లోని ‘విద్యా భరోసా’ ఊసే లేదు
పల్లవి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి దారుణంగా మారింది. రోజూ ఎక్కడో ఓ చోట ఫడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నా, వాటిని నియంత్రించడంలో సర్కారు విఫలమవుతున్నది. కొత్త సర్కారు ఏర్పడి ఎనిమిది నెలలు దాటినా.. ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేరు. సీఎం వద్దే విద్యా శాఖ ఉన్నది. సీఎం నిత్యం బిజీబీజీగా గడుపుతూ తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో కనీసం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా బడుల వ్యవస్థ, గురుకులాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించడం లేదని తెలుస్తున్నది. బడుల్లో స్కావెంజర్లు లేక.. తరగతి గదులు ఊడ్చే దిక్కు లేకుండా పోయారు. రాష్ట్రంలో వేలాది బడుల్లో అటెండర్లు లేరు. అటు అటెండర్లు లేక.. ఇటు స్కావెంజర్ల లేక కనీసం మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో అవి కంపుకొడుతున్నాయి. విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయినా వీటిపై ఒక్క సమీక్ష సమావేశం కూడా జరగలేదు.
గురుకులాల్లో మరీ దారుణం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కస్తూర్బా గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన భోజనం లేక నిత్యం ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గత ఎనిమిది నెలల్లో దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పురుగుల అన్నం.. నీళ్ల చారుతో తాము నిత్యం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.
పేరుకుపోయిన బకాయిలు
రాష్ట్రంలో దాదాపు రూ.5,900 కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు డ్యూ ఉన్న కారణంగా కాలేజీ యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సంవత్సరంతో కలిపితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8,350 కోట్ల వరకు చేరతాయని అంచనా. మరో వైపు ఆరు గ్యారంటీల్లో భాగంగా.. రూ.5 లక్షలతో ‘విద్యార్థి భరోసా’ అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ సర్కారు ఏర్పడి 8 నెలలు దాటినా.. ఇప్పటికీ అతీగతీ లేదు. కాలేజీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, స్కూటీలు కూడా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.
‘‘పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ కాలేజీలో చదువుకోవాలనే మంచి ఆలోచనతో మొట్టమొదట ఫీజు రియింబర్స్ మెంట్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు మారి, వేల కోట్ల రూపాయలు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. అవి మొండి బకాయిలుగా మారి.. వన్ టైమ్ సెటిల్ మెంట్ కు వచ్చాయి. దీని బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్న. ఈ ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైమ్ ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లించే ఏర్పాటు చేస్తం’’
– సీఎం రేవంత్ రెడ్డి, (జులై13న జేఎన్టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం కామెంట్స్)
15 లక్షల మంది అవస్థలు
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మేర ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు పెరిగిపోయాయి. రాష్ట్ర సర్కారు బకాయిలపై కనీసం స్పందించడం లేదు. కాలేజీలకు రియింబర్స్ మెంట్ నిధులు రాక.. యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే నిధులు రిలీజ్ చేయాలి. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేస్తాం.
– ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి



