లక్షా50వేల కోట్లతో థెమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తాం
లండన్ థెమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి.. పనులను ప్రారంభించబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందని.. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నానని సీఎం అన్నారు.



