రోహిత్ శర్మను ఔట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
టీమిండియా హిట్ మ్యాన్.. వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఔట్ చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. నిజంగా నిజమే. బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు రంజీ క్రికెట్ ఆటగాడని మనకు తెల్సిందే.
రంజీ క్రికెట్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో ముంబై తో హైదరాబాద్ తలపడినప్పుడు హైదరాబాద్ బౌలర్ గా పాడి కౌశిక్ రెడ్డి ముంబై తరపున ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఔట్ చేశారు. ఆ మధురస్మృతులను పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఎక్స్ లో కౌశిక్ రెడ్డి ట్వీట్ చేస్తూ ‘క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం.
ఇటీవల పాత వార్తాపత్రిక క్లిప్పింగ్లు చూస్తుంటే హైదరాబాద్-ముంబయి జట్ల మ్యాచ్ నాటి మధుర స్మృతులు గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసిన క్షణం నా మదిలో మెదిలింది. అలాంటి క్షణాలు నిజంగా అపురూపమైనవి” అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 15 మ్యాచ్ లు ఆడి 47 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 299 పరుగులు చేశాడు. అందులో ఓ ఫిఫ్టీ కూడా ఉండటం విశేషం. ఆ మ్యాచ్ లో ఇరవై ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి తొమ్మిది మెయిడిన్ చేసి నలబై ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లను తీశారు.




