హాస్యమే నా బలం, బలగం : రచ్చ రవి
– బలగం సినిమా నన్ను ప్రతి ఇంటికి చేర్చింది
– శిక్షణ, నైపుణ్యం ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు
– రచ్చ రవితో పల్లవి న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ
నలుగురిని నవ్వించాలనే కోరిక. సినిమాల్లో కనపడాలనే ఆశ. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే తపన. అవకాశాల కోసం ఏండ్ల తరబడి ఓపికగా వేచి ఉండి తనను తాను నిరూపించుకున్నాడు దొడ్డిపాటి రవి కుమార్ అలియాస్ రచ్చ రవి. జెమినీ టీవీలో ‘వన్స్ మోర్’తో ప్రస్థానం మొదలు పెట్టి జబర్దస్త్ లో రాణించి.. 120కి పైగా సినిమాల్లో కామేడియన్ గా, నటుడిగా విశేష ప్రేక్షకాదరణ పొందాడు రచ్చ రవి. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘పల్లవి న్యూస్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– పల్లవి, స్పెషల్ డెస్క్
పల్లవి: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? సినీ ఇండస్ట్రిలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?
రవి: మాది వరంగల్ జిల్లా. అమ్మానాన్న దొడ్డిపాటి శేఖర్, అహల్యలు. నాన్న వరంగల్ మున్సిపాలిటీలో పనిచేసేవాడు. నేను ఇంటికి పెద్ద కొడుకును కావడంతో నన్ను పెద్ద చదువులు చదివించాలని ఆయన కష్టపడేవాడు. నాకు సినిమాలపై ఉన్న మోజును ఆయనకు చెప్ప లేదు. ఇంటర్ తర్వాత మా చెల్లెలు దాచుకున్న కొన్ని డబ్బులతో హైదరాబాద్ చేరుకున్నాను. దుబాయ్ లో రేడియో జాకీగా పనిచేశాను. జీతం బాగానే వస్తున్నప్పటికీ అదే ఉద్యోగాన్ని ఇండియాలో చేయాలనుకున్నాను.
పల్లవి: జబర్దస్త్ షో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎంతో తోడ్పడింది. అందులో మీకు అవకాశం ఎలా వచ్చింది?
రవి: జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీంలో నటించేందుకు వెలువడిన ప్రకటన చూశాను. అడిషన్స్ కు వెళ్లాను. ఆ షోలో ఎంపికయ్యాను. చంద్రన్న సహకారంతో కాలక్రమంలో టీం సభ్యుడిగా నన్ను నేను నిరూపించుకున్నాను. ఒకరకంగా నా తల్లి జన్మనిస్తే, జబర్దస్త్ నా లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మరో జన్మనిచ్చింది. సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు వెళ్లలేకపోయాను.
పల్లవి: అటు కమెడియన్ గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు ఎలా రాణించగలుగుతున్నారు?
రవి: ప్రేక్షకులను మెప్పించగలిగేవాడికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఊహించడం, పాత్రకు తగ్గట్లుగా నన్ను నేను మలుచుకుంటూ, మారుతుంటూ ముందుకువెళ్తున్నాను. ఓ కళాకారిడిగా నా కళను ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తున్నాననే దానిపైనే నా దృష్టి ఉంటుంది. ఇక నేను చేసే పాత్రలన్నిటీ మూలం.. ఈ సమాజమే. కమెడియన్ గా నా ప్రతిభను గుర్తించి డైరెక్టర్లు నన్ను కామెడీకే పరిమితం చేయకుండా అన్ని ఎమోషన్లనూ పండించే అవకాశం ఇచ్చారు. వెండితెరపై మెరవాలన్న నా కోరిక 2013లో తేజ డైరెక్టర్ చేసిన ‘వంద అబద్ధాలు’ సినిమాతో నెరవేరింది. మిమిక్రీతో పాటు మూడు ప్రాంతాల యాసల్ని అలవోకగా పలికే టాలెంట్ ఉండడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో ‘నారప్ప, ఎంసీఏ, రెడ్, క్రాక్, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, గద్దలకొండ గణేశ్, కల్యాణ వైభోగం, బలగం, ఓం భీం బుష్’ వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పల్లవి: మీకు ఇచ్చిన పాత్రలో లీనమైపోయి చేస్తారా? బలగం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది కదా!
రవి: పాత్ర స్వభావాన్ని బట్టి నేను నటిస్తాను. ఒకసారి ఓ సినిమాలో సాయబ్ వేశం వేయాల్సి వచ్చింది. చార్మినార్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే.. నేను సాయబ్ వేశంలో ఊద్ పొగ వేస్తూ.. చార్మినార్ వద్ద నిలబడ్డాను. నేను నిజమైన సాయబ్ అనుకొని జనం నాకు పైసలు వేశారు. ఓ వృద్ధురాలు రూ.50 వేస్తే.. మిగతా వారు చిల్లర వేశారు. మొత్తం అరగంటలో రూ.120 వచ్చాయి. అంటే సన్నివేశంలో పాత్రను పలికించడం ముఖ్యం. బలగం సినిమాలో నాకు వేణు అన్న మంచి పాత్ర ఇచ్చారు. ఆ సినిమాలోని నా డైలాగ్ లు ‘ఆగుతవా రెండు నిమిషాలు’, ‘ఎవని పండుగ.. ఎవడెవడు తింటండు’ ఇప్పటికీ రీల్స్ లో తిరుగుతుంటాయి. బలగం సినిమా నన్ను తెలంగాణలో ప్రతి ఇంటికి చేర్చింది.
పల్లవి: ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? మీ లక్ష్యం ఏమిటి?
రవి: పని నేర్చుకునే ప్రతి చోట టీచర్ ఉంటాడు. అతనే గాడ్ ఫాదర్ అవుతాడు. మన ప్రతిభతో ఆయనను మెప్పిస్తే.. ఆయన మరో నలుగురికి పరిచయం చేస్తాడు. అల్టిమేట్ గా ట్యాలెంటే గాడ్ ఫాదర్. పని, పాత్ర ఇచ్చే వారి ఎక్స్ పెక్టేషన్స్ ఎప్పుడూ వమ్ము చేయొద్దు. సినిమాలో కనబడే స్థాయి నుంచి నా పాత్ర కథలోకి వచ్చిందంటే.. నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకోవడం వల్లే. దీంతోపాటు నాకు అవకాశం ఇచ్చిన అందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఎప్పుడూ కృతజ్ఞతాభావంతోనే ఉంటాను. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉంటాను.
పల్లవి: టాలీవుడ్ లో ఆంధ్రా, తెలంగాణ వేరియేషన్స్ మీకు ఎప్పుడైనా కనిపించాయా?
రవి: ట్యాలెంట్ ఉన్న ప్రతి కళాకారుడికి ఇండస్ట్రీ తల్లి లాంటిది. ఒక తల్లి తన బిడ్డలను వేరుగా చూడదు. ఆంధ్రా, తెలంగాణ వేరియేషన్స్ నాకు ఎక్కడా కనిపించలేదు. అంతెందుకు నేను కడప, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలీకాలతో అనేక సినిమాల్లో పాత్రలు చేశాను. నాకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఇండస్ట్రీలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా.. వారు అనుకుంటున్న పాత్ర ఎవరు చేయగలుగుతారని చూస్తారే తప్ప.. ప్రాంతీయవాదం ఎక్కడా చూపించారు.
పల్లవి: జమ్మి మొక్క నాటేందుకు మీరు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని విన్నాం.. ఎందుకలా?
రవి: ప్రకృతి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. జమ్మి చెట్టు పవిత్రత, మహత్యం, చరిత్ర తెలుసుకున్నాక ఆశ్చర్యమేసింది. ఇంతటి మహత్తరమైన జమ్మి చెట్లు ప్రతి ఊరిలో లేవని తెలిసింది. వెంటనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జమ్మి చెట్లు నాటాలని, నాటించాలని సంకల్పించాను. ఈ విషయాన్ని చినజీయర్ స్వామికి తెలియజేశాను. జమ్మి చెట్టు పవిత్రతోపాటు సైన్స్ పరంగా వాటి లాభాలను తెలిపారు. నా వెన్నుతట్టి జమ్మిచెట్లను ఊరూరా నాటాలని ఆశీస్సులు అందించారు. అమ్మా, నాన్నతో మొదలు.. శ్రీరామ నవమి రోజున ముందుగా నా జన్మస్థలం, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి నుంచి జమ్మి మొక్కలను నాటడం మొదలుపెట్టాను. జనగామ, వేముల వాడ, దేవరుప్పుల, సిరిసిల్ల, భువనగిరి, నల్గొండ జిల్లాలోని ప్రముఖ ఆల యాలతో పాటు అనేక గ్రామాలలోని దేవాలయాల్లో మొక్కలు నాటాను. ఇప్పటి వరకు 600 గుళ్లలో జమ్మిచెట్లు నాటాను. అస్సాం రాష్ట్రంలో తెలుగు వారి పిలుపు మేరకు అక్కడ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మొక్కలను నాటాను.
పల్లవి: ఇండస్ట్రీలోకి రావాలనుకునే యువత కోసం మీరు ఏం చెప్తారు?
రవి: కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి నేను చెప్పేది ఒక్కటే. మెడిసిన్ చదివి డాక్టర్ అవుతారు. ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అవుతారు. అలాగే నటుడు కావాలంటే.. ఏదో ఒక శిక్షణ, కోర్స్ ఉండాలి. ఇవేవి లేకుండా ఇండస్ట్రీకి రావడం వల్ల అవకాశాలు ఎలా వస్తాయి? అవకాశం ఇస్తే.. యాక్టింగ్ నేర్చుకుంటా.. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుదరదు. ఇండస్ట్రీలో వేల మంది కళాకారులు ఉన్నారు. పోటీ ఎక్కువ. దాన్ని తట్టుకొని.. ఎవరిని వారు నిరూపించుకోవాలంటే నైపుణ్యం కావాలి.



