హ్యాట్సాఫ్ అక్క.. తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసింది
ఈ రోజుల్లో ఏమి ఆశించకుండా ఒకరికోసం నిలబడటమంటే చాలా గొప్పనే చెప్పాలి. కానీ, స్వార్థాలు పెరిగిపోయి సొంత మనుషులనే వదిలేసి తమ దారి తాము చూసుకుంటున్న తరుణంలో ఓ మహిళ తన తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తమ్ముడిని తన బిడ్డలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ జీవనం సాగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని అంకలేశ్వర్ కు చెందిన 51 ఏళ్ల శీతల్ మోడీ తన తమ్ముడు అశ్విన్ తో కలిసి జీవిస్తోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వైకల్యంతో బాధపడుతున్న తమ్ముడిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. మెదడు ఎదగకపోవడం వల్ల 48 ఏళ్ల అశ్విన్ 6 నెలల చిన్నారిలా ప్రవర్తిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తాను లేకపోతే తమ్ముడు ఏమైపోతాడోనన భావించిన ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. అతనికి ఆమెనే స్నానం చేయిస్తారు. అన్నం తినిపిస్తారు. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తమ్ముడికి అన్ని పనులు శీతలే చేస్తారు. కన్నతల్లి కంటే ఎక్కువగా తమ్ముడి బాగోగులు చూసుకుంటున్న అక్క శీతల్ ను అందరూ అభినందిస్తున్నారు. నువ్వు గ్రేట్ అక్క అంటూ ప్రశంసిస్తున్నారు.



