Mallikarjun Kharge : అందుకే ఓడిపోయాం.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి : ఖర్గే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ అంచనాలను అందుకునే స్థాయిలో ఉన్నప్పటికీ పనితీరే పార్టీకి పెద్ద సవాల్ గా మారిందన్నారు.
Mallikarjun Kharge : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ అంచనాలను అందుకునే స్థాయిలో ఉన్నప్పటికీ పనితీరే పార్టీకి పెద్ద సవాల్ గా మారిందన్నారు. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా ఆయన అభిప్రాయపడ్దారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మనం ఐక్యంగా ఎన్నికల్లో పోరాడి, పరస్పరం వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మానుకోకపోతే రాజకీయంగా ప్రత్యర్థులను ఎలా ఓడించగలం? అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటికైనా పార్టీ నేతలు గుణపాఠాలు నేర్చుకోవాలని ఖర్గే సూచించారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని చెప్పిన ఖర్గే.. ఎలాంటి పరిస్థితుల్లో అయిన ఐకమత్యంగా ఉండాలన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం బాధించాయని తెలిపారు. ఇందుకు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితాలతో నిరాశ చెందకుండా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఖర్గే సూచించారు. సంస్థాగత స్థాయిలో మన బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ఫలితాలు మనకు ఒక సందేశం మాత్రమేనని చెప్పారు. పార్టీ నేతలు కష్టపడి పనిచేయాలని, సమయానుకూలంగా వ్యూహాలు రచించాలని ఖర్గే పిలుపునిచ్చారు.
కాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామ్యమైన మహా వికాస్ అఘాడీ పరాజయం పాలైతే, జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని పార్టీ కూటమి విజయం సాధించింది. హర్యానాలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.



