ప్రధాని మోదీకి బాలాపూర్ పూర్తి లడ్డు
బాలాపూర్ లడ్డూని వేలంపాటలో రికార్డు ధరకు దక్కించుకున్న సింగిల్ విండో ఛైర్మెన్ కొలను శంకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
బాలాపూర్ లడ్డూని వేలంపాటలో రికార్డు ధరకు దక్కించుకున్న బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ లడ్డూని ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూని ప్రధాని మోదీకి అందజేస్తానని ఆయన తెలిపారు.
గతేడాదికన్నా ఈ ఏడాది 3 లక్షలు అధిక ధరతో బాలాపూర్ లడ్డూని వేలంపాటలో దక్కించుకున్నారు సింగిల్ విండో ఛైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి. గత ఏడాది తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి లడ్డూని వేలం పాటలో రూ.27 లక్షలకు దక్కించుకోగా ఈసారి 30 లక్షల ఒక్క వెయ్యికి కొలను శంకర్ రెడ్డి లడ్డూని కైవసం చేసుకున్నారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను రికార్డు ధరకి దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలంపాటలో పాల్గొనేందుకు చాలామంది వస్తుంటారు. ఈ ఏడాదికి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్ లో లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. మొట్టమొదటిసారి బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించినప్పుడు రూ.450 తో ప్రారంభమైంది.



