పేరుకే స్వీపర్ ..కోట్లల్లో ఆస్తులు.. లగ్జరీ కార్లు
అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన స్వీపర్ సంతోష్ కుమార్ జైస్వాల్ ఇంటికి వెళ్లిన అధికారులు అతని రూ.కోట్ల ఆస్తులు చూసి షాకయ్యారు. అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లను గుర్తించి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగింది. సంతోష్ కుమార్ జైస్వాల్ మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. తన పరిచయాలతో కమిషనర్ ఆఫీసులో ఫైళ్లను తారుమారు చేస్తున్నట్లు తేలడంతో సస్పెండ్ అయ్యాడు. ఫైళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు అతనిపై ఫిర్యాదు అందడంతో అప్పటి కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణ జరిపి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. అతనిపై నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దేవీపటాన్ మండల కమిషనర్‌గా ఉన్న యోగేశ్వర్రామ్ మిశ్రా ఆదేశాల మేరకు తహసీల్దార్ జైస్వాల్‌కు చెందిన లగ్జరీ వాహనాల గురించి సమాచారం ఇవ్వాలని అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారికి లేఖ రాశారు. వాహనాలను తనిఖీ చేసి అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సమర్పించిన నివేదికలో సంతోష్ కుమార్ కి ఒకటి కాదు ఏకంగా తొమ్మిది లగ్జరీ వాహనాలు ఉన్నాయని, అవి.. అతని సోదరుడు, భార్య పేర్లతో రిజిస్టర్ చేయబడినవి అని విచారణలో తేలింది. తాజాగా వెలుగు చూసిన లగ్జరీకార్ల భాగోతం అనంతరం అతడి బ్యాంకు ఖాతాల మీద ఫోకస్ పెంచారు అధికారులు.



