Eknath Shinde : చెప్పులరిగేలా తిరిగా.. సీఎం ఎంపికపై షిండే సంచలన కామెంట్స్
సీఎం విషయంలో బీజేపీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు
సీఎం విషయంలో బీజేపీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశాను.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయానని తెలిపారు.
ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగానన్న షిండె.. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పుకొచ్చారు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు అండగా నిలిచారని వెల్లడించారు షిండే.
ఎన్నికలు అయిపోయాక ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఫోన్లో మాట్లాడాను. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపానన్నారు. షిండే కామెంట్స్ బట్టి చూస్తే సీఎం రేసు విషయంపై సైడ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.
కాగా ఇటీవల వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 132 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన (షిండే వర్గం) 57 స్థానాల్లో గెలిచింది, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొందింది. అయితే, గత మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 మాత్రమే గెలుచుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ స్థానాలను గెలుచుకుంది.



