సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : గత కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తోందని ఆరోపిస్తోన్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమెకు భారత పౌరసత్వం లభించక ముందే, ఢిల్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైందని తాజాగా బీజేపీ ఆరోపించింది.
ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆధారాలను బయటపెట్టడం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు స్పష్టంగా ఉందని, ఒక విదేశీ పౌరురాలికి ఇది ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు.
ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి, ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు.అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరడంపై మాలవీయ సందేహాలు వ్యక్తం చేశారు. ఒక ఇటలీ పౌరురాలి పేరును భారత ఓటర్ల జాబితాలో ఎలా చేర్చారు? అప్పటి ప్రభుత్వం ఒత్తిడితో ఇది జరిగిందా? లేక గాంధీ కుటుంబం మోసపూరితంగా ఈ పని చేసిందా? అని మాలవీయ వరుస ప్రశ్నలు సంధించారు.