తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ : బీఎల్ సంతోష్
తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పని చేయాలన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.



