pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • International »
  • The World Is Facing A Serious Leadership Problem

సమర్థ నాయకత్వమే సవాల్

ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది.

సమర్థ నాయకత్వమే సవాల్
  • Edited By: Pallavi,
  • Published on November 12, 2024 / 01:07 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది. పలితంగా ఎన్ని అనర్ధాలో! మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న ‘వాతావరణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) విపరిణామాలు అడ్డుకునేందుకు పెద్దఎత్తున నిర్వహించే భాగస్వామ్య దేశాల సదస్సు`కాప్ కూడా విఫలమౌతోంది. దాదాపు రెండొందల దేశాలు పాల్గనే ఈ సదస్సులు ఏటేటా ఆశావహ వాతావరణంలో మొదలై, కడకు ఉస్సురనిపిస్తూ ముగియడం యేటా ఇదొక రివాజయింది. అజర్బైజాన్లోని ‘బాకు’లో వచ్చే రెండు వారాలపాటు జరుగనున్న ‘కాప్`29’ సదస్సు ముంగిట్లో నిలబడి..ఎందుకిలా జరుగుతోంది? అని సమీక్షించుకుంటే ఇదే స్పష్టమౌతోంది. ‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడిరద’న్న సామెత మాదిరి పరిస్థితి తయారైంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అభివృద్ది చెందిన దేశాల ద్వంద్వ వైఖరి.. మొత్తం లక్ష్యాన్నే నీరుగారుస్తోంది. ఇందుకు, నాయకత్వలేమి ఓ జఠిల సమస్య!

కిమ్, తన వైపు వేలెత్తి చూపే ధైర్యం ఉత్తర కొరియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఎవరూ చేయొద్దంటాడు. జిన్ పింగ్ జీవితకాలం తానే చైనాకు నాయకత్వం వహించేలా వ్యూహాలు రచిస్తుంటాడు. తన కడ ఊపిరిదాకా రష్యాలో తానే రాజ్యమేలాలి అనుకుంటాడు వ్లాదిమిర్ పుతిన్. ఎన్ని కన్నీళ్లు ఒలికించైనా, ఎంత రక్తపుటేరులు పారించైనా…. ఇజ్రాయిల్ కీర్తి ప్రతిష్టల పతాకను ఎగురవేస్తూనే ఉంటానంటాడు నెతన్యాహు. ఏం చేసైనా అధికారం చేజారనీయవద్దని కెనెడా దౌత్యనీతినే తుంగలో తొక్కుతాడు జస్టిన్ ట్రూడో. మాయ మాటలు చెప్పి, మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై వస్తాడు డొనాల్డ్ ట్రంప్. బ్రెజిల్ ప్రజల తిరస్కారంతో ఓడినా, తిరిగి అధికారంలోకి వచ్చే కుయుక్తుల్లో తలమునకలౌతుంటాడు బల్సనారో! ఈ నాయకుల వైఖరిని లోతుగా పరిశీలిస్తే చాలు ప్రపంచ పాలనా వ్యవస్థల్లో ఎటువంటి గాలులు వీస్తున్నాయో ఇట్టే బోధపడుతుంది. ప్రజాస్వామ్య వాతావరణమో, విశాల జనహితంలో నిర్ణయం తీసుకునే ఔదార్యమో… మచ్చుకైనా కనిపించని ధీనస్థితి అంతటా అలుముకుంటోంది! మొత్తం కార్పొరేట్లకు దాసోహమంటున్న స్వార్థ పాలకుల విపరీత వైఖరుల వల్లే పర్యావరణం ఏ విధమైన రక్షణకు నోచుకోకుండా పరిస్థితులు విషమిస్తున్నాయి. శిలాజ ఇంధన వినియోగం, వాతావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాల వల్ల అతిగా వేడెక్కుడుతున్న పుడమి వాతావరణ మార్పులకు కారణమౌతోంది. ఫలితంగా… గతితప్పిన రుతువులు, అకాల వర్షాలు, అసాధారణ ఎండలు, అతి-అనావృష్టి, తీవ్ర కరువులక వంక, బీబత్సమైన వరదలింకొక వంక మానవ జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అభివృద్ది చెందని, చెందుతున్న వెనుకబడిన దేశాలే!

వేగంగా ముంచుకొస్తున్న ప్రమాదం

మూడొందల యేళ్ల కిందటి పారిశ్రామికీకరణ తర్వాత పుడమి మీద ప్రకృతి సమతుల్యత భయంకరంగా చెడిపోతోంది. అంతకు ముందు లక్షల యేళ్లుగా మనిషి ఉనికి ఉన్నా పొడసూపని ప్రమాదం తర్వాతి కాలంలోనే మంచుకొచ్చింది. నదుల వెంట నాగరికత పరిఢవిల్లిందన్న మానవేతిహాసంలో… అయిదారు వేల యేళ్ల చరిత్ర వికాస గతికి తగిన ఆధారాలున్నాయి. ఆ వేలాది సంవత్సరాల్లో కూడా మనిషి మహా గొప్పగా ప్రకృతితో సహజీవనం చేశాడు. భూమ్యావరణం, వాతావరణం ఆరోగ్యంగానే ఉంది. అందుకు మన భారత, రామాయణ, భాగవతాది కథలే కాకుండా ప్రపంచంలోని చాలా ఐతిహాసిక, చారిత్రక కథల్లోనూ ఈ సహజీవన వర్ణనే ఎంతో గొప్పగా ఉంది. పరస్పరం ఆధారపడుతూ, ఉభయత్రా ప్రయోజనకరంగా ఈ సహజీవనం సాగింది. పురాణ కథలు, గాథలే ఇందుకు ప్రభల సాక్ష్యం! ఐరోపాలో విజ్ఞాన వికాసం తర్వాత, వారిలో విస్తరణ`సామ్రాజ్య కాంక్ష పెరిగాక పరిస్థితి క్రమంగా చెడిపోయింది. 1700 తర్వాతి పారిశ్రామికీకరణ అనంతరం ప్రకృతిలోకి మానవ జోక్యాలు, ప్రమేయాలు అడ్డదిడ్డంగా జరిగి, వాతావరణ కాలుష్యం ఎన్నోరెట్లు పెరిగింది. సౌఖ్యాలకు మరిగిన మనిషి సహజ-ప్రకృతి వనరుల వినియోగాన్ని అసాధారణ స్థాయిలో పెంచాడు. బగ్గు, పెట్రోలియం, సహజవాయు వినియోగం పెంచడంతో కర్బన ఉద్గారాలు అసాధారణ స్థాయికి చేరాయి. విద్యుదుత్పత్తి తర్వాత ఇది మరింత హెచ్చింది. వాతావరణ మార్పు (సీసీ) పై అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన భాగస్వామ్యదేశాల అంతర్ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) నివేదికలు పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాయి. పారిశ్రామికీకరణనాటికి ఉన్న ఉష్ణోగ్రతలపైన తాపొన్నతి పెరుగుదలను సగటున 2 డిగ్రీల సెల్సియస్కు మించనీయకుండా కట్టడి చేయాలని అంతకు ముందే పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. ఆ మేరకు ఎవరికి వారుగా ప్రమాణాలు నిర్దేశించుకొని కర్భన ఉద్గారాలను తగ్గించాలని, కఠిన నిర్ణయాలు అమలు చేయాలని డిసెంబరు-2015, పారిస్ సదస్సులో సభ్యదేశాలు అంగీకరించాయి. అలా ఊహించి, అంచనా వేసిన దానికన్నా వేగంగా`తీవ్ర వాతావరణమార్పు విపరిణామాలు ముంచుకు వస్తున్నాయని, తాపొన్నతి కట్టడిని 2 డిగ్రీల సెల్సియస్ కాకుండా 1.5 డిగ్రీల సెల్సియస్కే తగ్గించాలని ఐపీసీసీ నివేదికలు హెచ్చరించాయి. ముఖ్యంగా దక్షణాసియా, అందులోనూ భారత ద్వీపకల్పానికి ఎక్కువ ప్రమాదసంకేతాలున్నాయనీ ఈ నివేదికలు చెప్పాయి. ఆహారోత్పత్తిపై ఎంతో ప్రతికూల ప్రభావం ఉంటుందనీ తెలిపాయి.

ప్రధాన వైఫల్యాలెక్కడ?

ఎంతో ఆశావహమైన వాతావరణంలో ఈ కాప్ సదస్సులు ప్రారంభమవుతాయి. పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణకు స్వీయ హామీల ప్రకారం చర్యల నివేదికను సభ్య దేశాలు సదస్సుకు సమర్పిస్తాయి. కానీ, ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రధాన`విధాన నిర్ణయాల విషయంలో పలు కార్పొరేట్ లాబీలు కలుగజేసుకొని, అంతిమంగా వాటిని తమకు అనుకూలంగా ప్రభావితం చేస్తాయి. అభివృద్ది చెందిన సమాజాలు కూడా ఈ కుట్రలో భాగమవుతాయి. విధానాల నుంచి నిర్ణయాల్లో, నిర్ణయాల నుంచి తీర్మానాల్లో, తీర్మానాల నుంచి కార్యాచరణలో…. ఇలా క్రమంగా తరుగుదల వచ్చేలా వాటిని పలుచన చేసే కుట్ర లోపాయికారిగా జరుగుతోంది. ఫలితంగా లక్ష్యాల సాధన ఎప్పటికప్పుడు వెనుకడుగులోనే ఉంటోంది. ఖండాంతరాలకు వ్యాపార`వాణిజ్యాలను విస్తరించిన బహులజాతి కంపెనీలు, కార్పొరేట్ల లాబీ ఎంతో శక్తిసంపన్నమైంది. ఇది, వివిధ దేశాల రాజకీయార్థిక విధానాలను, తద్వారా నిర్ణయాలను ప్రభావితం చేసేంత పటిష్ట స్థితిలో ఉండటం ‘కాప్’ వంటి సదస్సుల పురోగతికి ప్రతిబంధకంగా మారుతోంది. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ, ఎదుర్కొనే సామర్థ్యాల పెంపుకు హామీ ఇచ్చిన మేర ‘వాతావరణ నిధి`ఆర్థిక వనరు’ అందజేయడానికి అభివృద్ది చెందిన దేశాలు మన:పూర్వకంగా ముందుకు రావటం లేదు. ఉమ్మడిగా అందరూ కలిసి, యేటా లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక సహాయానికి 2011 కొపెన్హగన్ సదస్సులో అంగీకరించిన అభివృద్ది చెందిన దేశాలు ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు. 2020లోనే ఇది మొదలై 2030 వరకు సాగాలి. ఇవేవీ తగురీతిలో కార్యాచరణకు రాక, ప్రతి కాప్ సదస్సు తర్వాత ఒక భారీ నిట్టూర్పు తప్ప ఏమీ మిగలట్లేదు.

పెద్దల పెలుసు మాటలు

వాతావరణ మార్పు అనేది ఒక కాల్పనిక వాదమని, అది అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడిగా తొలి విడత అధికారంలో ఉన్నపుడే డొనాల్డ్ ట్రంప్ నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారు, పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కానీ, ఎలాగోలా అమెరికా ఒప్పందంలో భాగస్వామిగా కొనసాగింది. పదవీచ్యుతుడైన నాలుగేళ్ల తర్వాత మళ్లీ (వచ్చే జనవరిలో) పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు. భూగ్రహానికే ఊపిరితిత్తి లాంటి అమెజాన్ అటవుల నాశనానికి, బ్రెజిల్ పాలకుడిగా కారకుడైన బల్సనారో….. ‘వాతావరణ మార్పా గాడిద గుడ్డా!’ అని వ్యాఖ్యానించారు. ఆ భావనకు వ్యతిరేకంగా, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత, మళ్లీ ప్రజాభిమానం పొంది అధికారంలోకి రావటానికి బల్సనారో యత్నిస్తున్నారు. భారత్కు వ్యతిరేకంగా దౌత్యనిర్ణయాలు తీసుకుంటూ, అప్రకటిత యుద్ధం కొనసాగిస్తున్న కెనెడా ప్రదాని జస్టిస్ ట్రూడో చరిత్ర కూడా ఏం గొప్పగా లేదు. ఉక్రెయిన్పై యుద్దం కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్ కు ‘కాప్’ సదస్సులపై సదభిప్రాయమే లేనట్టు ఆయన మాటలు, వ్యవహార శైలినిబట్టి స్పష్టమౌతుంది.

పలు చోట్ల, పలు విధాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల పట్ల, వాటి పరిష్కారాల సాధన దిశలో ప్రపంచ నాయకత్వం సరైన ఉమ్మడి దృక్పథంతో లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్వవ్యాపితంగా జరిగిన ఒక సర్వేలో పాల్గన్న వారిలో 86 శాతం మంది, తమకు సరైన నాయకత్వం లభించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాతావరణంపై 1972 స్టాక్హోమ్ సదస్సు నుంచి, రియో`డిజెనెరో, కొపెన్హెగెన్, జహనస్బర్గ్ సదస్సులు, క్యోటో ప్రోటోకాల్, ఐక్యరాజ్యసమితి (యూఎన్) రెండు దఫాలుగా వెల్లడిరచిన మిలినియం డెవలెప్మెంట్ గోల్స్ (ఎమ్డీజీ), సుస్థిరాభివృద్ది లక్ష్యా (ఎస్డీజీ) లు సాధించే దిశలో పయనం ఇవన్నీ సమకాలీన ప్రపంచానికి, ప్రపంచ నాయకత్వానికి సవాళ్లే! వాటిని స్వీకరించి, విశ్వ మనవాళిని సురక్షితమైన, సుస్థిరాభివృద్దిపరమైన భవిష్యత్తు వైపు సమర్థంగా నడిపించాల్సిన నాయకత్వ అవసరం ఈ ప్రపంచానికి ఎంతగానో ఉంది.

-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ డైరెక్టరు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • contemporary issues
  • empathize
  • leadership problem
  • Pallavi news
  • world

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

Latest
  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy