ప్రమాదంలో తెలంగాణ భవిష్యత్: కిషన్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పోయి.. రేవంత్ వచ్చినా ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. తప్పుడు హామీలు, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గత సర్కారు తీరులాగే పనిచేస్తోందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి. గతంలో సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ ఇద్దరూ రాజకీయాల్లో దిగజారిపోయారు. వారు వాడే పదాలు చాలా అసహ్యంగా ఉంటున్నాయి. వ్యక్తిగత దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు”అని మండిపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు37 శాతం ఓట్లు సాధించామని, రానున్న 4 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రభుత్వం తరఫున నిరంతర ఉద్యమాలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.



