ఆదివారం అల్లాడించిన హైడ్రా బుల్డోజర్లు..ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి?
హైడ్రో బుల్డోజర్లు ఇవాళ మళ్లీ జెట్ స్పీడ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించాయి.
భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో కొద్ది రోజులు ఖాళీగా ఉన్న హైడ్రో బుల్డోజర్లు ఇవాళ మళ్లీ జెట్ స్పీడ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించాయి. ఆదివారం హైదరాబాద్ లోని కూకుట్పల్లి, అమీన్పూర్లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవానాలను మాత్రమే ఇవాళ కూల్చినట్లు తెలిపింది.
కూకట్ పల్లి నల్లచెరువులోని మొత్తం 16 కమర్షియల్ షెడ్లు,ప్రహరీ గోడలను కూల్చి నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలోని క్రిష్ణారెడ్డిపపేటలోని 3 భవనాలు కూల్చేశామని,వాణిజ్యపరంగా వినియోగిస్తున్న ఐదంతస్తుల భవానాన్ని కూల్చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఒక ఎకరా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పటేల్ గూడలో 25 ఆక్రమ నిర్మాణాలను కూల్చేసి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తన ప్రకటనలో తెలిపింది.
మరోవైపు,పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే..మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హైడ్రా బాధిత మహిళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని కొందరు బాధితులు ఏడవడం వీడియోలలో కనిపించింది.
విలువైన సామాన్లు కూడా బయటకి తీసుకోకుండా. కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి దగ్గర తాము ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్నామనీ, ఆరేళ్ల లీజ్ ఉందనీ.. అందువల్ల అక్కడ తాము ఇల్లు కట్టుకుంటున్నామని.. ఓ బాధిత కుటుంబం చెబుతోంది. అది అక్రమమైతే.. తమకు టైమ్ ఇవ్వాలనీ అప్పుడు తాము వేరే చోటికి వెళ్తామని అంటున్నారు. టైమ్ ఇవ్వకుండా కూల్చివేస్తే ఎలా అని ఆ బాధిత ఫ్యామిలీ ఆవేదన చెందుతోంది. తమ ప్రాణాలు తీశాక, కూలగొట్టమని బాధితులు ఏడుస్తున్నారు. తమ ఫ్యామిలీలో ఒక అమ్మాయి.. గర్భిణీ అని, ఇలాంటి పరిస్థితి ఉంటే కూల్చుతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



