జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఎవరికి…?
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వార్ -2 . ఈ సినిమా ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలు ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ” ఇరవై ఐదేండ్ల కిందట రామోజీరావు గారు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అప్పుడు నావెంట అమ్మ , నాన్న ఉన్నారు. నేను హీరోగా కెరీర్ మొదలెట్టిన సమయంలో ఆందోల్ నుంచి ముజీబ్ నాకు మొట్టమొదటి అభిమానిగా నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరూ లక్షల నుంచి కోట్లాది మంది నాతో నడిస్తున్నారు. నా ఎదుగుదలకు నిర్మాతలు, దర్శకులు, అమ్మ నాన్నలతో పాటు అన్నలు కళ్యాణ్ రామ్, జానకి రామ్ , అభిమానుల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకోచ్చింది. వార్ -2 మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది కేవలం బాలీవుడ్ సినిమా మాదిరి చూడకండి. ఇది మన సినిమా . మన తెలుగు సినిమా.. మన ఇండియన్ సినిమా” అని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ ” ముఖ్యంగా మా తాత గారి ఆశీర్వాదం ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఆపలేరు. నా అభిమానుల రుణం ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను. నాకు నాన్న గారు జన్మనిచ్చారు. ఆ జన్మ అభిమానులకే అంకితం . జీవితాంతం మిమ్మల్ని ఎంటర్ ట్రైన్ చేస్తాను” అని అన్నారు.



