‘అతడు’ సీక్వెల్ పై మురళీ మోహాన్ క్లారిటీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, చెన్నై భామ త్రిష హీరోయిన్ గా నాజర్, ప్రకాశ్ రాజ్ , సునీల్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘ అతడు’ . 2005లో విడుదలైన ఈ చిత్రం మొదట మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుని ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాను టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ , సీనియర్ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో అతడు మూవీకి కూడా సరికొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ఆయనను ఓ జర్నలిస్టు అతడు సినిమాలో మీరు ఎందుకు నటించలేదు అని మురళీ మోహన్ ను అడిగారు.
దీనికి సమాధానంగా మురళీ మోహన్ బదులిస్తూ అతడు సినిమా నిర్మాణ సమయంలో తన సతీమణి పెట్టిన కండీషన్ కారణంగానే అప్పట్లో తాను ఆ సినిమాలో నటించలేదని తెలిపారు. ‘ అతడు సినిమాలో నాకు పాత్ర ఇవ్వలేదు. నేను సినీ పరిశ్రమలోకి రావాలనుకున్న మొదట్లో మా ఆవిడ ఓ కండీషన్ పెట్టారు. నేను ఎవరి వద్దకు వెళ్లి నాకు పాత్ర ఇవ్వమని అడగకూడదు అని అప్పట్లోనే స్పష్టం చేసింది.
నా కెరీర్ అంతా కూడా నావద్దకు వచ్చిన పాత్రలనే చేశాను . ఇప్పటికీ అదే రూల్ ను నేను పాటిస్తున్నాను. అందుకే అతడు చిత్రంలో నేను కన్పించలేదు’ అని మురళీ మోహన్ వివరించారు. మరోవైపు మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అతడు చిత్రానికి సీక్వెల్ తీస్తానని మురళీ మోహన్ మీడియాకు వెల్లడించారు. ఆ సినిమాను వాళ్ళిద్దరితో తప్ప వేరేవాళ్లతో అయితే నేను తీయలేనని స్పష్టం చేశారు.