ఎన్టీఆర్ వివాదంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ఏపీ అధికార టీడీపీకి చెందిన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జూనియర్ అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని మరి సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై లేటెస్ట్ గా ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పిన తర్వాత కూడా… ఆ అంశంపై వివాదాన్ని కొనసాగించడం భావ్యం కాదని అన్నారు.సామాన్యులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకురాబోయే సంస్కరణలకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఈ సంస్కరణల వల్ల రాష్ట్రంపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, ఈ కారణంగానే కొత్తగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పయ్యావుల వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.