21వ చిత్రాన్ని ప్రకటించిన మనోజ్
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యువహీరో , మంచు వారి వారసుడు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్ధాలు పూర్తయిన సందర్భంగా తన ఇరవై ఒకటో సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ తాను సినిమాలోకి అడుగుపెట్టి ఇరవై ఒక్క వసంతాలు పూర్తయ్యాయి. ఇన్నాళ్లుగా తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు.
తన కెరీర్ లోనే ఇరవై ఒకటో సినిమా పేరు డేవిడ్ రెడ్డి. హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కనున్నది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో 1897-1922 మధ్యలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రం మేకర్స్ వెల్లడించనున్నారు అని తెలిపారు.
తన తండ్రి మంచు మోహన్ బాబు హీరోగా నిర్మాతగా తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్ మూవీతో మంచు మనోజ్ బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత దొంగ దొంగది సినిమాలో హీరోగా నటించారు. చాలా విరామం తర్వాత మనోజ్ భైరవం సినిమాలో కన్పించారు. గజపతి వర్మగా నటించిన మనోజ్ ఆలయ భూములను , నగలను రక్షించే పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో నటుడిగా తనకు కొత్త జన్మ మొదలైందని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో తెలిపారు.



