క్షమాపణలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..!
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న తాజా మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆదిత్య చోప్రా నిర్మాతగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో భారీగా నిర్వహించింది చిత్రం యూనిట్.
ఈ వేడుకకు ఇద్దరూ స్టార్ హీరోలతో పాటు మూవీ మేకర్స్, సినీ ప్రముఖులతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హజరయ్యారు. మరోవైపు అటు ఏపీ ఇటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరుతూ ఎక్స్ లో పోస్టు చేశారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగడానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టీ గారికి , పోలీస్ డిపార్ట్మెంట్ కు అందరికీ పేరుపేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరందరికీ పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో అభిమానుల ఆనందానికి కారణమయ్యారు ” అని ఆయన అన్నారు.



