రీఎంట్రీపై ఇలియానా క్లారిటీ

పల్లవి, వెబ్ డెస్క్ : తన అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు టాప్ హీరోయిన్ గా ఏలిన గోవా బ్యూటీ ఇలియానా డి’క్రజ్. యువహీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరీ సరసన నటించి తన అందంతో అభినయంతో మెప్పించింది. తాజాగా ఇలియానా తన రీఎంట్రీ గురించి అభిమానులకు స్పష్టత ఇచ్చింది. తన పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, నటనకు గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో తప్పకుండా రీఎంట్రీ ఇస్తానని ఆమె తాజాగా ప్రకటించారు.
తాజాగా నటి నేహా ధూపియాతో జరిగిన ఓ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఇలియానా, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రస్తుతం తన పూర్తి సమయం ఇద్దరు కుమారులకే కేటాయిస్తున్నానని ఇలియానా తెలిపారు. “సినిమాల్లోకి తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నాను. కెమెరా ముందు నటించడం, అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం, సినిమా సెట్స్‌లో ఉండే వాతావరణాన్ని నేను తీవ్రంగా మిస్ అవుతున్నాను. నా పని అంటే నాకు చాలా ఇష్టం. కానీ, ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలే నా ప్రపంచం. వారి ఆలనాపాలనా చూడటమే నా మొదటి ప్రాధాన్యత. అందుకే నటనకు కాస్త విరామం ఇచ్చాను.. త్వరలోనే మీముందుకు వస్తాను” అని ఆమె వివరించారు.
చివరిసారిగా ఈగోవా బ్యూటీ ఇలియానా 2024లో ‘దో ఔర్ దో ప్యార్’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం రవితేజ సరసన నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇలియానా రీఎంట్రీ ప్రకటనతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.