నేను మంచోడిని కాదంటే.. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా
నటుడు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ స్పందించారు. తనపై లావణ్య చేసినవని ఆరోపణలు మాత్రమేనని, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని అన్నారు. మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారని పేర్కొన్నారు.
నాకు పెళ్లి అంటే భయం..
‘‘నాకు భయపడాల్సిన అవసరం లేదు.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను లీగల్‌గా వెళ్తున్నాను. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ఎందుకు లేదు? నేనేం తప్పించుకొని తిరగలేదు. పోలీసులు నాకు నోటీసులిచ్చారు, నేను స్పందించాను. నాలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నేను మనిషినే, నాకు బాధగా ఉంటుంది. ఆ బాధతోనే ‘పురుషోత్తముడు’ సినిమా సమయంలో బయటికి రాలేదు. నాకు పెళ్లంటే చాలా భయం. నాకు జీవితంలో పెళ్లిపై ఆసక్తి లేదు. నా 32 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో ఎంతో మందితో సాన్నిహిత్యం ఉంది. నేను మంచి వాడిని కాదు అని ఇండస్ట్రీలో ఎవరైనా చెబితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను. లావణ్య ఆరోపణలతో నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఎంతో బాధపడింది. మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టే మహిళలున్నారు. నాపై కూడా అలాగే తప్పుడు కేసులు పెట్టారు. నాపై వచ్చిన ఆరోపణలపై భయంతోనే నేను ఇన్ని రోజులు బయటకి రాలేదు’’ అని రాజ్ తరుణ్ తెలిపారు.
లావణ్యను అడ్డుకున్న పోలీసులు
‘తిరగబడరసామీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్న విషయం తెలుసుకున్న లావణ్య.. వెంటనే అక్కడికి బయలుదేరింది. అయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, లావణ్య ముగ్గురూ ఒకే వేదికపైకి వస్తే.. గొడవ జరిగే అవకాశం ఉందని ముందే గుర్తించిన పోలీసులు ప్రసాద్ ల్యాబ్స్ ముందు మోహరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆపడానికి ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చిన లావణ్యను పోలీసులు గేట్ వద్ద నిలిపివేశారు. దీంతో చేసేదేమీ లేక లావణ్య వెనుదిరిగి వెళ్లి పోయింది.




