అమలపై మండిపడుతున్న నాయకులు
అక్కినేని అమలపై పొలిటీషియన్స్ ఫైర్ అవుతున్నారు.
అక్కినేని అమలపై పొలిటీషియన్స్ ఫైర్ అవుతున్నారు. రాజకీయ నాయకులపై అమల వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ (Rahul Gandhi) హ్యుమానిటీ గురించి ప్రశ్నించడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని నేతలు ఫైర్ అవుతున్నారు. అమల ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. కొండా సురేఖ ఒక బీసీ మహిళ అని.. తన ఆత్మగౌరవం, గౌరవాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా స్పందించిందని.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం ఈ ఘటనకుగల మెయిన్ రీజన్పై ఫోకస్ చేయాలని మల్లు రవి సూచించారు. బీఆర్ఎస్ నాయకులూ సురేఖపై చేసిన ట్రోలింగ్స్ కారణంగా ఆమె ఎంత మనోవేదనకు గురై ఇలా మాట్లాడి ఉంటారని సమర్ధించారు.
సమంత–నాగచైతన్య విడాకుల విషయంపై బుధవారం తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ మొత్తం ముక్తకంఠంతో ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా గట్టిగానే స్పందించింది. సమంత కూడా స్పందించడంతో చివరికి కొండా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పింది. అయితే బుధవారం రాత్రి అమల ఓ సంచలన పోస్ట్ ని ఎక్స్ లో పెట్టింది.
అమల తన ఎక్స్ పోస్ట్ లో..”ఓ మహిళా మంత్రి రాక్షసంగా మారడం.. కల్పిత ఆరోపణలు చేయడం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలోని పౌరులను వాడుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. మంత్రి గారు మీకు సిగ్గుగా లేదా ఎలాంటి వాస్తవాలు లేకుండా నా భర్త గురించి పూర్తిగా అసత్య కథనాలను ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. నాయకులు నేరస్తులలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను విశ్వసిస్తే, దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండి. మీ మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆమె విషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా తక్షణమే చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి” అని అమల తన ట్వీట్ లో తెలిపారు.



