హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. అక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవిని ఇంటికి వెళ్లి కలిశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు అక్కడకు వచ్చారు. దాంతో అక్కడి ఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయగా నంద్యాల పోలీసులు సెక్షన్ 188 కింద అల్లు అర్జున్ తో పాటు, శిల్పా రవిపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా జన సమీకరణ చేశారని కేసు నమోదు చేశారు. దాంతో.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు.. కొద్దిరోజుల క్రితమే తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పును వెల్లడించింది. ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.