Sandhya Theatre : సంధ్య థియేటర్ చరిత్ర ఎంతమందికి తెలుసు ?
ఆర్టీసీ క్రాస్ రోడ్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సినిమా.. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఇక్కడ జాతరే.. అందులోనూ సంధ్య థియేటర్ లో రిలీజ్ అంటే ఆ రచ్చ వేరే ఉంటుంది.
ఆర్టీసీ క్రాస్ రోడ్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సినిమా.. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఇక్కడ జాతరే.. అందులోనూ సంధ్య థియేటర్ లో రిలీజ్ అంటే ఆ రచ్చ వేరే ఉంటుంది. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఈ థియేటర్ లో సినిమా చూడటం హీరోలకు సెంటిమెంట్ అయితే… ఓ ప్రేక్షకుడు సినిమా చూడటం ఓ ఎమోషన్. అలాంటి ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇంతకీ ఈ సంధ్య థియేటర్ హిస్టరీ ఏంటీ ?
తెలుగు సినిమాకు ఎంత చరిత్ర ఉందో సంధ్య థియేటర్‌కి అంతటి చరిత్ర ఉంది. అది 1979 .. దేశంలో 70MM థియేటర్ల ప్రస్థానం అప్పుడే మొదలవుతున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్ 70MM జనవరి 18 1979న ప్రారంభం అయింది. ఈ థియేటర్ లో ముందుగా హిందీ సినిమా షాలిమార్ ను ప్రదర్శించారు. ఆ తరువాత సూపర్ డూపర్ హిట్ షోలే ఈ థియేటర్ లో రిలీజ్ అయింది. ఆ తరువాత మూడు పువ్వులు ఆరు కాయాలు అన్నట్టుగా సంధ్య థియేటర్ ప్రస్థానం కొనసాగింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎన్నో థియేటర్లు ఉన్నా సంధ్య థియేటర్ చాలా స్పెషల్ థియేటర్ అని చెప్పాలి. ఈ థియేటర్ లో తమ సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలు పోటీ పడేవారు. ఒకప్పుడు సినిమాలు విడుదల అయ్యే థియేటర్ల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అయితే సంధ్య ధియేటర్ కచ్చితంగా తమ థియేటర్ల జాబితాలో ఉండాలంటూ స్టార్ హీరోలు సెంటిమెంట్‌గా నిర్మాతలకు చెప్పే వారు. ఇందులోనే పవన్ కల్యాణ్ తొలి ప్రేమ సినిమా ఏకంగా 227 రోజుల పాటు నడిచింది. ఇక ఈ థియేటర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఖుషి నిలిచింది.
ఒకప్పుడు 15 వందల మంది ప్రేక్షకుల కెపాసిటీతో ఉండేది సంధ్య థియేటర్. కానీ ఆ తర్వాత వసతులు పెంచుతూ, మోడ్రన్‌గా మార్చిన సమయంలో 13 వందల 23కి సీటింగ్ కెపాసిటీని తగ్గించారు. సంధ్య 70MMతో పాటు 35MM కూడా ఉంటుంది. 1981లో సంధ్య 35MM థియేటర్ మొదలైంది. ఏది ఏమైనప్పటికీ, డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఒక విషాదకరమైన సంఘటన తర్వాత ఈ థియేటర్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించేందుకు థియేటర్‌కు పది రోజుల పాటు సమయం ఇచ్చారు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సంధ్య థియేటర్ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



