అభిమానికి అండగా హీరో బాలకృష్ణ

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో , హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొప్ప మనసును చాటుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా అదోని పట్టణానికి చెందిన బద్రిస్వామి అనే బాలయ్య బాబు అభిమాని గత కొంతకాలంగా కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ వ్యాధి చికిత్సకు దాదాపు ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతాయని వైద్యులు బద్రిస్వామికి తెలిపారు. ఆర్థిక సమస్యలతో చికిత్స చేయించుకోలేని బద్రిస్వామి పరిస్థితి గురించి తెలుసుకున్న అదోని పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.
అభిమాని బద్రిస్వామి పరిస్థితులను తెలుసుకున్న హీరో బాలకృష్ణ తక్షణమే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ పదిలక్షల ఎల్వోసీ (Letter Of Credit) ని మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని బాలయ్య సతీమణి వసుంధర బద్రిస్వామి కుటుంబానికి అందజేశారు. సమస్యను తెలుసుకుని అభిమానికి అండగా నిలిచిన బాలయ్యపై అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.