టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలైన రానా దగ్గుబాటి, రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, సీనియర్ స్టార్ నటుడు , విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, యువస్టార్ హీరోయిన్లు అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్ , సీనియర్ నటి మంచు లక్ష్మీ లకు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) గట్టి షాకిచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి వీరితో పాటు దాదాపు ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులు, సోషల్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ , కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PML) కింద కేసులు నమోదు చేసింది.
సైబరాబాద్ పీఎస్ లో గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈ దర్యాప్తును చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు , సోషల్ ఇన్ ఫ్య్లూయెనర్స్ భారీ మొత్తంలో పారితోషికాలను తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఈ ప్రముఖులు చేసిన ప్రచారం కారణంగానే యువత ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని ప్రభావితమై ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో ఈ కేసు మరింత తీవ్రరూపం దాల్చడంతో అతి త్వరలోనే వీరందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.