బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం: పొన్నం
పల్లవి, హైదరాబాద్: రేపటి నుండి గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం రూ. 20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. శనివారం బేగంపేట హోటల్ హరితా టూరిజం ప్లాజా లో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు -2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బోనాల ఉత్సవ క్యాలెండర్ (కాఫీ టేబుల్ బుక్), ఈవెంట్ క్యాలెండర్, బోనాల పండుగపై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, పాటను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ నగర సంస్కృతి సాంప్రదాయాలను దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి హైదరాబాద్ ప్రజల సహకారం కావాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య రాకుండా అధికారులు పని చేస్తారని పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మంత్రి సీతక్క అదనపు నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సెక్రటరీ హన్మంతరావు , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురేషెట్టి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, వివిధ దేవాలయాల కమిటీలు పాల్గొన్నాయి.



