అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్

పల్లవి వెబ్ డెస్క్: గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ.. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డును ప్రకటించి.. సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు అయింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరగడం.. ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు కోమాలోకి వెళ్లడం తెలిసిందే. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో లో తన తప్పు ఏమీ లేదని అల్లు అర్జున్ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎకంగా అసెంబ్లీ వేదికగా.. అల్లు అర్జున్ చేసిన పొరపాటును వివరించారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని తేల్చి చెప్పారు. ఆ మాట కొస్తే.. అల్లు అర్జున్ కలలో కూడా ఊహించని విధంగా గాంధీ ఆస్పత్రి మెట్లు(పరీక్షల కోసం), పోలీస్ స్టేషన్ మెట్లు, జైలుకు కూడా పంపించారు. తొక్కిసలాట ఎపిసోడ్ రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుగా సాగింది. అయితే ఇప్పుడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ.. మళ్లీ అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే.. అల్లు అర్జున్ పేరు అవార్డుల లిస్ట్ లో పెట్టారా? అనే చర్చ జరుగుతోంది. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో అవార్డు ఇవ్వకపోతే విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందనే అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ను జ్యూరీ ఛైర్‌పర్సన్, ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు.
ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి, ప్రతి ఏడాదీ ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే, 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణనలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
2024 సంవత్సరానికి ప్రకటించిన కొన్ని ప్రధాన అవార్డులు:
మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేతా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన – ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోషల్ (పుష్ప 2 – ‘సూసేకి అగ్గిరవ్వ కళ్లెత్తితే’ పాటకు)
ఉత్తమ హాస్య నటులు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
ఉత్తమ బాల నటులు: మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక
ఉత్తమ కథా రచయిత: చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)