అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల పన్నెండో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికలు అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ పార్టీలు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామనే ధీమాను అధికార టీడీపీ చెబుతుండగా, లేదు ఈ రెండు స్థానాలు మావే కాబట్టే మళ్లీ మేము గెలుస్తామనే ధైర్యంతో వైసీపీ శ్రేణులు ఉన్నారు.
మరో రెండు రోజుల్లో పోలింగ్ మొదలు కానున్న తరుణంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఓటుకు భారీ మొత్తంలో చెల్లించాలని ఉవ్విరుల్లుతున్నట్లు తెలుస్తుంది. అధికార టీడీపీ ఐదు నుంచి ఆరు వేల రూపాయలను ఓటుకు ఖర్చు చేయాలని వ్యూహరచన చేస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార టీడీపీ ధన బలం, అధికార బలాన్ని తట్టుకోవాలంటే ఓటుకు పదివేలకు తగ్గకుండా ఇవ్వాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టి అయినా ఈ రెండు స్థానాల్లో గెలవాలని టీడీపీ, ఇవి గతంలో సిట్టింగ్ స్థానాలు కాబట్టీ మేమే గెలవాలని వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. చూడాలి మరి స్థానిక ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో..?