నారా లోకేశ్ కు ప్రమోషన్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ నాయుడుకి ప్రమోషన్ రానున్నదా..?. ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో ప్రమోషన్ ఇవ్వనున్నరా..?. అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేశ్ యువగళం పేరుతో చేసిన పాదయాత్రతో ఇటు పార్టీకి పూర్వవైభవం రావడంతో పాటు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాం తెప్పించారు నారా లోకేశ్ అని వారు చెబుతున్నారు.
అంతేకాకుండా గెలుపు ఊసే లేని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడమే కాకుండా అత్యంత భారీ మెజార్టీతో అక్కడ టీడీపీ గెలవడంలో చిన్నబాబు మ్యాజిక్ ఉందని తమ్ముళ్లు సంబురపడుతున్నారు. పార్టీ భవిష్యత్తు ఆశాకిరణం, భావి తరాలకు కాబోయే సీఎం నారా లోకేశ్ కాబట్టి అందులో భాగంగానే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెడతారని గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఈ నిర్ణయాన్ని కడపలో జరగనున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమం వేదికగా బాబు ప్రకటించనున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. చూడాలి మరి బాబు ప్రకటన చేస్తారో.. లేదో..?.



